‘గాంజా శంకర్’పై టీఎస్ నాబ్ నజర్!
మార్చాలంటూ హీరో, దర్శకుడు, నిర్మాతకు నోటీసులు
కొద్ది కాలంగా అభ్యంతరకరమైన సినిమా టైటిల్స్, సీన్లు, ట్రైలర్‌లపై దృష్టి
గతంలో బేబీ చిత్రంలో దృశ్యాలపై కూడా స్పందించిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (టీఎస్-నాబ్) అధికారులు అవసరమైన సందర్భాల్లో సినిమాల ‘సెన్సార్ బోర్డు’బాధ్యతల్నీ చేపడుతున్నారు. ఆయా చిత్రాల్లో మాదకద్రవాల వినియోగాన్ని ప్రేరేపించేలా ఉన్న సీన్లు, టైటిల్స్ మార్చాల్సిందిగా ఆదేశిస్తున్నారు. గతంలో ఆనంద్ దేవరకొండ హీరోగా వచి్చన ‘బేబీ’చిత్రంపై స్పందించిన అధికారులు తాజాగా సాయి ధరమ్‌తేజ్ కథానాయకుడిగా రూపొందించిన ‘గాంజా శంకర్’ను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ సినిమా టైటిల్ మార్చాలని, చిత్రంలోని సన్నివేశాల్లో సైతం గంజాయి పండించడం, విక్రయించడం, వినియోగించడాలను ప్రోత్సహించేవిగా లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఈ మేరకు టీఎస్ నాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య శనివారం హీరో సాయి ధరమ్‌తేజ్, నిర్మాత ఎస్.నాగవంశీ, దర్శకుడు సంపత్ నందిలకు నోటీసులు జారీ చేశారు.
‘బేబీ’లో వివాదాస్పదమైన ఓ సీన్…
మాదాపూర్‌లోని విఠల్‌నగర్‌లో ఉన్న ఫ్రెష్ లివింగ్ అపార్ట్‌మెంట్‌లో జరుగుతున్న ఓ డ్రగ్ పార్టీపై టీఎస్ నాబ్ అధికారులు గతేడాది దాడి చేశారు. ఆ ఫ్లాట్‌లో కనిపించిన సీన్‌కు అప్పట్లో విడుదలైన ‘బేబీ’సినిమాలోని సీన్లకు మధ్య సారూప్యత ఉందని అధికారులు తేల్చారు. దాంతో మాదకద్రవ్యాల వినియోగాన్ని ప్రేరేపించేలా ఉన్న ఆ సన్నివేశాలకు సంబంధించి చిత్ర యూనిట్‌కు నోటీసులు ఇచ్చారు. దీంతో అభ్యంతరకరమైన సీన్లు వచి్చనప్పుడు సినిమాలో వారి్నంగ్ నోట్ వచ్చేలా దర్శకుడు చర్యలు తీసుకున్నారు.
తాజాగా మరోసారి తెరపైకి వివాదం…
గత ఏడాది సెప్టెంబర్ నాటి ‘బేబీ’చిత్రం తర్వాత ఈ వివాదం మళ్లీ తెరపైకి రాలేదు. తాజాగా శుక్రవారం ట్రైలర్ విడుదలైన గాంజా శంకర్ చిత్రం విషయంలో టీఎస్ నాబ్ కలగజేసుకుంది. ఈ సినిమా టైటిల్‌తో పాటు ట్రైలర్‌లో కనిపించిన సన్నివేశాలు సైతం యువత… ప్రధానంగా విద్యార్థులను గంజాయి వినియోగం, విక్రయం వైపు ఆకర్షించేలా ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. ఈ చిత్ర కథానాయకుడు గంజాయి వ్యాపారిగా కనిపిస్తున్నాడని, దీని ప్రభావంతో పలువురు ఆ దారిలో వెళ్లే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు.
ఈ మేరకు టీఎస్ నాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య ‘గాంజా శంకర్’ సినిమా హీరోతో పాటు దర్శకనిర్మాతలకు నోటీసులు జారీ చేశారు. సినిమా టైటిల్‌తో పాటు అభ్యంతరకరమైన, గంజాయి, డ్రగ్స్ వైపు యువతను మళ్లించేలా ఉన్న వాటిని మార్చాలని స్పష్టం చేశారు. సినిమా పేరులో ఉన్న గాంజా అనే పదం తీసేయాలని కోరారు. అలా కాని పక్షంలో ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బాలీవుడ్ చిత్రాలపై ఎన్సీబీ సహాయంతో…
ఈ నోటీసుల ప్రతిని టీఎస్-నాబ్ అధికారులు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, డైరెక్టర్స్ అసోసియేషన్లతో పాటు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు పంపారు. అయితే బాలీవుడ్ చిత్రాల్లో డ్రగ్స్‌కు సంబంధించిన సీన్లు అనేకం ఉంటున్నాయి. ఇప్పటి వరకు వీటి విషయం ఎవరూ పట్టించుకోలేదు. టీఎస్ నాబ్ అధికారులు మాత్రం వీటినీ తీవ్రంగా పరిగణించాలని యోచిస్తున్నారు. బాలీవుడ్ చిత్రాల్లోనూ డ్రగ్స్‌ను ప్రేరేపించేలా సీన్లు లేకుండా చూడాలని, ఉన్న వాటిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ అ«దీనంలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోను (ఎన్సీబీ) కోరనున్నారు. ఆ విభాగం లెక్కల ప్రకారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 14 కోట్ల మంది డ్రగ్స్ వినియోగదారులు ఉన్నారు. డ్రగ్స్ ప్రేరేపించే చిత్రాలను సీరియస్‌గా తీసుకోకుంటే భవిష్యత్‌తరాలు నిర్విర్యమయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.