Shivaji Jayanti 2024: మరాఠా సామ్రాజ్యాధిపతి ఛత్రపతి శివాజీ జీవిత చరిత్రపై మరో సినిమా రాబోతున్నది. గతంలో శివాజీ జీవితంలోని కొన్ని ఘట్టాలకు సినిమాలు రాగా..
ఇప్పుడు బాలీవుడ్ ప్రముఖ హీరో రితేశ్ దేశ్‌ముఖ్ శివాజీ నేపథ్యంలో సినిమా తీయనున్నాడు. పెద్ద తెరపై శివాజీ జీవితాన్ని మరోసారి చూడనున్నాం. శివాజీ జయంతి సందర్భంగా సోమవారం ఈ విషయాన్ని చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాకు దర్శకత్వంతోపాటు శివాజీ పాత్రలో రితేశ్ నటించనున్నాడు. సినిమా పేరును కూడా ప్రకటించారు. ‘రాజా శివాజీ’ పేరిట సినిమాను తెరకెక్కించనున్నాడు.
సొంత భాష మరాఠీతోపాటు హిందీలో ద్విభాష చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. వచ్చే ఏడాది విడుదల చేయాలని సినిమా బృందం భావిస్తోంది. రితేశ్ ప్రస్తుతం ‘వేద్’ సినిమా విజయోత్సాహంతో ఉన్నాడు. ఈ చారిత్రక సినిమాకు దర్శకత్వం వహించడమే కాకుండా చారిత్రక శివాజీ పాత్రలో రితేశ్ మెరవనుండడం విశేషం. ‘ఛత్రపతి శివాజీ మహారాజ్ అనేది ఒక పేరు కాదు ఒక భావోద్వేగం. శివాజీ జయంతిని పురస్కరించుకుని ఈ నేల కన్న గొప్ప నాయకుడికి నేను నివాళులర్పిస్తున్నా. అతడి జీవిత ప్రస్థానం తరతరాలుగా స్ఫూర్తి రగిలిస్తోంది. శివాజీ ఆశీస్సులతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం. జై శివ్‌రాయ్’ అని రితేశ్ దేశ్‌ముఖ్ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా చిన్న వీడియోను పంచుకున్నాడు.
జాతీయ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ సంతోశ్ శివన్ ఈ సినిమాతో మరాఠీ సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. అజయ్ తుల్ సంగీతం అందిస్తుండగా.. త్వరలోనే షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఇక తన భర్త నటిస్తున్న ఈ సినిమాకు జెనీలియా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జియో స్టూడియోస్ సమర్పణలో ముంబై ఫిల్మ్ అకాడమీ బ్యానర్‌లో ‘రాజా శివాజీ’ సినిమా తెరకెక్కుతోంది. జ్యోతి దేశ్‌పాండే కూడా మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.