కరీంనగర్: మహిళలు చాలా శక్తిమంతులని, ఏదైనా తలుచుకుంటే సాధించి తీరుతారని, పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. గురువారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. తోటి మహిళలను చులకనగా చూడవద్దని, వారికి తగిన గౌరవం ఇవ్వాలని పేర్కొన్నారు. అబ్బాయిలు, అమ్మాయిలను సమానంగా చూడాలని, వ్యత్యాసం చూపవద్దని తెలిపారు. ఇంటి నుంచే మార్పుకు శ్రీకారం చుట్టాలని, అందరూ కలిస్తేనే నవ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మహిళలు అభద్రత భావంతో ఉండవద్దని చెప్పారు. ధైర్యంతో ముందుకెళ్లాలని పేర్కొన్నారు. ఉన్నత విద్యను అభ్యసించి, ఆర్థికంగా ఎదగాలని సూచించారు. మహిళలను నిరంతరం ప్రోత్సహించాలని పేర్కొన్నారు. మనకు మనమే ప్రశ్నించుకుంటూ ముందుకెళ్లాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్ మాట్లాడుతూ పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని, ఇందుకు తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నారు. వారు అన్ని రంగాల్లో ముందుండేలా చూడాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కేక్ కట్ చేశారు. పలువురు మహిళా జడ్పిటిసిలు, ఎంపీపీలతోపాటు వివిధ రంగాల్లో సేవలందిస్తున్న మహిళలను కలెక్టర్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చిన్నారులు నిర్వహించిన నృత్యం ఆకట్టుకుంది. సాంస్కృతిక సారథి కళాకారులు ఆటపాటలతో అలరించారు. వ్యాఖ్యాతగా మాడిశెట్టి గోపాల్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా వైద్యాధికారి సుజాత, మార్కెటింగ్ అధికారి పద్మావతి, సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ ధనలక్ష్మి, చిగురుమామిడి, హుజురాబాద్, రామడుగు ఎంపీపీలు కొత్త వినిత, రాణి, కవిత, కరీంనగర్ రూరల్ జడ్పిటిసి పురుమల్ల లలిత, చొప్పదండి జడ్పిటిసి సౌజన్య, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ స్వరూపారాణి, అడిషనల్ డిఆర్డిఓ సంధ్యారాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.