కరీంనగర్: మహిళల పట్ల సమాజంలో కొంత చిన్న చూపు చూస్తున్నారని, దానికి స్వస్తి పలికి వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. గురువారం రేకుర్తిలోని సంగీత ఇన్ హోటల్ లో తెలంగాణ గ్రామీణ బ్యాంకు కరీంనగర్ రీజినల్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారని, పురుషులకంటే మహిళలు అధికంగా ఉద్యోగాలు సాధిస్తున్నారని పేర్కొన్నారు. ఒకవైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. తోటి మహిళలకు సహకారం అందించాలని సూచించారు. బాధ్యత యుతంగా పనిచేయాలని, తద్వారా సంస్థకు మంచి పేరు తేవాలని పేర్కొన్నారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు కరీంనగర్ రీజినల్ పరిధిలో 56 బ్రాంచ్ ల నుంచి 80 మంది మహిళ ఉద్యోగులు మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్యాంక్ అధికారులు కలెక్టర్ ను ఘనంగా సన్మానించారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు రీజినల్ మేనేజర్ ప్రభుదాస్, ఎస్ ఎమ్ ఓ సాయి కృష్ణ, ఎస్ఎంబి రాజు, వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ మమత, బ్యాంక్ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.