హైదరాబాద్: విద్యుత్ సబ్స్టేషన్లలో స్థానికంగా సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేలా స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. మేడ్చెల్-మల్కాజిగిరి జిల్లా మహిళా స్వయం సహాయక సంఘాలతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు ఏర్పాటు చేసిన వస్తు ఉత్పత్తుల స్టాల్స్‌ను సందర్శించి మహిళలతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. రానున్న రోజుల్లో ఇందిరమ్మ ఇళ్లను ఆడబిడ్డల పేరుతో ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్నట్టు చెప్పారు. మహిళా సంఘాలకు సున్నా వడ్డీ రుణాలు అందిస్తున్నామన్నారు.
ఈ నెల12న సాయంత్రం పరేడ్ గ్రౌండ్లో లక్ష మంది మహిళలతో నిర్వహించే కార్యక్రమంలో మహిళా శక్తిని చాటుదామని ముఖ్యమంత్రి చెప్పారు. కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు.