హైదరాబాద్: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) 2024 నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలో శిక్షణ పొందిన బీఈడీ, డీఈడీ విద్యార్థులకు శుభవార్త. డీఎస్సీకి అర్హత సాధించే విధంగా సాధ్యమైనంత తొందరగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్- టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) నిర్వహించాలని ప్రభుత్వం, పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ను ఆదేశించింది. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి గత నెల 29 వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. డీఎస్సీ రాయడానికి టెట్ తప్పనిసరి కావడంతో మరోసారి పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజా నిర్ణయంతో రాష్ట్రంలో దాదాపు మూడు లక్షల మంది అభ్యర్థులకు ఊరట లభిస్తుంది. ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని విద్యాశాఖ సూచించింది. టెట్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపిన కొద్దిసేపట్లోనే నోటిఫికేషన్ విడుదల కావడం విశేషం.