పరీక్షల్లో ఒత్తిడిని జయించాలి: పోలంపెల్లి ఆదర్శన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు, తెలంగాణ టీచర్స్ యూనియన్, కరీంనగర్ జిల్లా శాఖ

రాష్ట్రంలో పదవ తరగతి బోర్డు పరీక్షలు ఈ నెల 18 వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ప్రతి విద్యార్థి 11 పరీక్షలు రాయాల్సి ఉండగా కరోనా అనంతరం పేపర్ల సంఖ్యను 6 కు తగ్గించగా ఈ సంవత్సరం సైన్స్ పేపర్ ను భౌతిక, జీవ శాస్త్రానికి వేర్వేరుగా చేసి మొత్తం ఏడు పేపర్లకు పెంచారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు పరీక్షల సమయంలో ఒత్తిడికి గురికావొద్దు, పరీక్షలే జీవితం కాదు. తల్లిదండ్రులు వారి కలల్ని పిల్లలు నెరవేర్చాలని అనుకోవద్దు. పరీక్షల ఒత్తిడిని ఎలా జయించాలి పిల్లలు ఒత్తిడిని జయించడానికి పెద్దలు ముఖ్యంగా తల్లిదండ్రుల సహకారం చాలా అవసరం. పిల్లలపై ఒత్తిడి పెంచకుండా వారినెప్పుడూ ప్రోత్సహిస్తూ ఉండాలి. వారు నీరసపడినప్పుడు, ఓటమినెదుర్కున్నప్పుడు తల్లిదండ్రులు చెప్పే మంచి మాటలు మళ్లీ వాళ్లను కార్యోన్ముఖుల్ని చేస్తాయి. గెలుపు, ఓటములు రెండింటినీ సమానంగా స్వీకరించే స్ఫూర్తిని పిల్లల్లో నింపవలసిన బాధ్యత తప్పకుండా పెద్దలదే. వారేచిన్న విజయం సాధించినా వాళ్లను మెచ్చుకోండి. అది టానిక్ లా పనిచేస్తుంది. వెనుకబడినప్పుడు మాత్రం తిట్టకండి. అనునయించి నీవు మరింత ప్రయత్నిస్తే సాధించగలవనే ధైర్యాన్ని ఇవ్వండి. మార్కుల గురించి మర్చిపోయి కూడా మాట్లాడకండి. వేరే పిల్లలతో పోల్చకండి. అప్పటికే ఒత్తిడిలో ఉన్నవాణ్ణి మరింత ఒత్తిడికి గురికానివ్వవద్దు. పరీక్షలు, మార్కులు ఎలా ఉన్నా మేమున్నాం అనే భరోసా ఇవ్వండి. ఒత్తిడికి గురైనప్పుడు సాధారణంగా పిల్లలు సరిగ్గా తినలేరు. సరైన ఆహారం తీసుకోకపోతే ఏ పని మీద సరిగ్గా ధ్యాస పెట్టలేరు. కాబట్టి మీరు ప్రత్యేక శ్రద్ద తీసుకోండి. తృప్తిగా తినటం చాలా అవసరం. ఎక్కువగా నీరు తీసుకోవటం కూడా మంచిది.పరీక్షలు ముఖ్యమైనవి కానీ.. అవి మన జీవితానికే పరీక్షలు కావని, అవి జీవితాలను ఆపవని చెప్పండి. తల్లిదండ్రులు వారి కలల్ని పిల్లలపై రుద్దొద్దు.తమ కలలు పిల్లలు నెరవేర్చాలని అనుకోవడంతో చిన్నారులపై భారం పెరుగుతుంది. అలా చేయకూడదు. పిల్లలు విఫలమైనప్పుడు కూడా తల్లిదండ్రులు చిన్నారుల వెన్ను తట్టి ప్రోత్సహించాలి.

 

పరీక్షలంటే ముందుగా మనలో భయం పోవాలి. దాన్ని రోటీన్ గా జరిగే ఒక విషయంగానే అర్థం చేసుకోవాలి. ఫలితంపై దృష్టిపెట్టి లేనిపోని ఒత్తిడికి గురికావద్దు. మనం చేసే పనిని సవ్యంగా చేస్తే ఫలితం దానంతట అదే వస్తుంది. మనం చేసేపని ఒక క్రమపద్ధతిలో చేయాలి. కేవలం పరీక్షలొస్తున్నాయనో, లేదంటే మంచి ర్యాంకు రావాలనో పరీక్షలకు ముందు మాత్రమే అన్నీ మానేసి బట్టీ పట్టటం అంత మంచిది కాదు. మీకు పరీక్షలంటే ఆందోళన, భయం ఉండవచ్చు. ఉండటం సహజం కూడా! అదేదో మీకు ఒకరికే వుందనీ, నేనేమీ చేయలేకపోతున్నానీ అనుకోవద్దు. అందరిలాగే మీరు పరీక్ష రాసేదే. మీరొక్కరే కాదు. మీ మిత్రుల్లాగే మీరు కూడా. నాకొక్కడికే ఈ భయం, బాధ వున్నాయని అనుకోవద్దు. అందరిలా నేనూ వ్రాస్తున్నాననీ, అందరిలాగే నేనూ ఆందోళన చెందుతున్నాననీ తెల్సుకుంటే ఈ భయం నుండి బయట పడవచ్చు.

 

అన్నింటికంటే ముఖ్యం మీకు తెల్సినదానిపై దృష్టి పెట్టండి. తెలియని దాని గురించి ఎక్కువగా ఆలోచించి బుర్రపాడు చేసుకోవద్దు. నాకు తెలియదు. తెలియటం లేదు అనే ఆందోళన దరి చేరనివ్వకండి. విద్యార్థులు లక్ష్యాన్ని చేరుకోలేకపోవడం  క్షమార్హం.. కానీ లక్ష్యం చిన్నదైతే మాత్రం అది క్షమార్హం కాదు.మీరు ఎంచుకునే లక్ష్యాలు సాధ్యమైనంత వాస్తవంగా ఉండాలి.అందని పొందని లక్ష్యాన్ని ఊహించుకుని, దాన్ని చేరుకోలేక నీరసపడటం సరైంది కాదు. అందుకే ఎప్పుడో వచ్చేదాని గురించి కాకుండా రేపేం చేయాలి లేకుంటే వచ్చేవారంలో ఏం చేయాలి అనే దానిమీద ధ్యాసపెట్టండి. అలా చేస్తే మన సమీప లక్ష్యం నుండి అనుకున్న సుదూర లక్ష్యాన్ని కూడా సునాయాసంగా చేరుకోవచ్చు. కిందిమెట్టు మీద నిల్చుని ఆఖరి మెట్టుకు దూకలేం కదా! ఒక్కొక్క మెట్టు ఎక్కితేనే పై మెట్టును చేరుకోగలం. ఇవేవీ మీకు తెలియనివి కావు కాని ఒత్తిడి వలన లేక అతిగా అంచనా వేసుకోవటం వల్ల ఇబ్బందులు పడతాం. మనం చేసే పనుల్లో ఏది ముఖ్యమైందో, ఏది త్వరగా పూర్తి చేయాలో ముందుగా ఒక అంచనాకు వచ్చి తగిన విధంగా ప్రణాళిక వేసుకోవాలి.. మనం వేసుకున్న ప్రణాళికలు కేవలం పరీక్షల కోసమే ఉండకూడదు. మనం ప్రతిదినం చేసే పనులకూ ఇది వర్తించాలి. చదువులకు కేటాయించిన సమయంలో చదువుకోవటం, ఆటల సమయంలో ఆటలు ఇలా జీవితంలో అన్నింటికీ సమపాళ్లు ఉంటేనే కేవలం పరీక్షలనాడే ఆందోళన పడి చదివే బాధ, భయంపోతాయి. చదువుతున్నప్పుడు అదే పనిగా చదవటం కాక మధ్య మధ్యలో బ్రేక్ ఇవ్వండి. అది మనం జ్ఞాపకం ఉంచుకోవటానికి కూడా తోడ్పడుతుంది.రాత్రుళ్లు నిద్రమాని పరీక్షలకు చాలా మంది తయారవుతుంటారు. కాని నిద్రలేకపోతే మన మెదడు, శరీరం చురుగ్గా పనిచేయవు. అందుకే మంచి నిద్ర కూడా అవసరం. నిద్ర వచ్చినప్పుడు నిద్రపోవటం కూడా మీ పరీక్షల తయారీకి తోడ్పడుతుంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

RECENT NEWS