- లక్ష్యం సాధించే వరకు విశ్రమించొద్దు: జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
- వెంకట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు నగదు బహుమతి పంపిణీ
హుజురాబాద్, మే 25: విద్యార్థులు లక్ష్యాన్ని సాధించే వరకు విశ్రమించొద్దని, అహర్నిశలు శ్రమించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పిలుపు నిచ్చారు. ఎంత కష్టం వచ్చినా వెనుకడుగు మాత్రం వేయవద్దని, ముందుకే సాగాలని సూచించారు. శనివారం సాయంత్రం కరీంనగర్ బొమ్మకల్ బైపాస్ రోడ్ లోని వీ కన్వెన్షన్ హాల్ లో వెంకట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గంప వజ్రమ్మ మూడవ విద్యా పురస్కార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్యఅతిథిగా హాజరై 10 జీపీఏ సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఒక్కొక్కరికీ మూడు వేల నగదు, గోల్డ్ మోడల్ ను జిల్లా కలెక్టర్ అందజేశారు. కాగా హుజురాబాద్ మండలం లోని 13 ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని కనవేణి జయశ్రీ 10 జీపీఏ సాధించగా మూడు వేల నగదు, గోల్డ్ మోడల్ ను అందజేసి.. హుజురాబాద్ మండలం లోనే టాపర్ నిలిచెట్టు చేసిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం దేవారం మేరీ శోభారాణి ని శాలువ తో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు వెంకట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహాయం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. విద్యార్థులను తల్లిదండ్రులు ఎల్లప్పుడూ ప్రోత్సహించాలని, తద్వారా వారు మంచి ఫలితాలు సాధిస్తారని తెలిపారు. ప్రైవేటు పాఠశాలల దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించారని చెప్పారు. పదో తరగతిలో మార్కులు ఎక్కువగా వచ్చాయని ఇంటర్లో చదవకుండా ఉండొద్దని సూచించారు. చదువుల్లో ఫస్ట్ ఉండాలని, గమ్యస్థానం చేరుకునే వరకు కష్టపడుతూనే ఉండాలని పేర్కొన్నారు. పెద్దపల్లి అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ పట్టుదలతో ముందుకెళ్లాలని సూచించారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అన్ని రంగాల్లో రాణించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సివిల్స్ ర్యాంకర్లు నందాల సాయికిరణ్, కొలనుపాక సహన, వెంకట్ ఫౌండేషన్ చైర్మన్ గంప వెంకట్, వైస్ ప్రెసిడెంట్ జయ రాములు, సెక్రటరీ సతీష్ కుమార్, నాగరాజు, వెంకట్ ఫౌండేషన్ ప్రతినిధులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.