ఎల్కతుర్తి, మైత్రీ న్యూస్: ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్ లోని శ్రీ చైతన్య పాఠశాలలో గురువారం పాఠశాల ప్రిన్సిపాల్ పాకాల రాజిరెడ్డి అధ్యక్షతన బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత మొదటి ప్రధాని పండిత జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి బోధన చేశారు. చిన్నారులకు చిత్రలేఖనం, ఆట పాటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ రాజిరెడ్డి మాట్లాడుతూ… భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జన్మదినం పురస్కరించుకొని ప్రతి ఏటా నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటామని గుర్తు చేశారు. బాలల దినోత్సవం ప్రాముఖ్యత గురించి వివరించారు. చదువు అంటే కేవలం పుస్తకాలు చదవడమే కాదని, ఆటలు, పాటలు, చిత్ర లేఖనం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు కూడా విద్యలో భాగమేనని అన్నారు. విద్యార్ధులు మొబైల్ ఫోన్కు దూరంగా ఉండి పుస్తకానికి దగ్గర అవ్వాలని కోరారు.. విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని లక్ష్య సాధన కోసం కృషి చేయాలని సూచించారు.. చిన్నారులు పలువురు దేశ, జాతీయ నాయకుల వేషధారణతో ప్రదర్శన నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ మల్లెంపాటి శ్రీవిద్య, ఏజీఎం పద్మాకర్, కో ఆర్డినేటర్ తిరుమల్ రెడ్డి, డీన్ రజనీకాంత్, సీ బ్యాచ్ ఇంచార్జ్ మధు, ప్రైమరీ ఇంచార్జీ గౌసియా, ఫ్రీ ప్రైమరీ ఇంచార్జీ ప్రతిమ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.