కరీంనగర్: నేతన్నలకు ఉపాధి కల్పించేందుకు చేనేత వస్త్రాలను అందరూ ఆదరించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. కరీంనగర్ కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టర్ ను చేనేత సహకార సంఘాల ప్రతినిధులు సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా అన్ని రకాల చేనేత ఉత్పత్తులను కలెక్టర్ కు చూపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చేనేత వస్త్రాలు చాలా బాగున్నాయని పేర్కొన్నారు. ఉపాధి కోసం చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా ప్రతి సోమవారం అధికారులందరూ చేనేత వస్త్రాలు ధరించేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. దీంతోపాటు ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి సందర్భంగా చేనేత వస్త్రాల స్టాళ్లను ఏర్పాటు చేసుకొని విక్రయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హ్యాండ్లూమ్స్ ఏడి చరణ్ తో పాటు చేనేత సహకార సంఘాల ప్రతినిధులు సభ్యులు పాల్గొన్నారు.