నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి
తప్పిదాలు జరుగకుండా చూసుకోవాలి
మాక్ పోలింగ్ పకడ్బందీగా నిర్వహించాలి
అర్హులందరూ పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా ప్రత్యేక చర్యలు
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
గంగాధరలో పీవో, ఏపీఓల శిక్షణ కార్యక్రమం పరిశీలన
కరీంనగర్: పార్లమెంట్ ఎన్నికల విధుల్లో పాల్గొనే పీవోలు, ఏపీవోలు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. పోలింగ్ రోజున ఎలాంటి తప్పిదాలు జరుగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గంగాధర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చొప్పదండి (ఎస్సీ) అసెంబ్లీ సెగ్మెంట్ స్థాయి పీవోలు, ఏపీఓలకు ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా పనిచేయాలని సూచించారు. పోలింగ్ కు ముందు రోజు, పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలు, సామగ్రిని జాగ్రత్తగా తీసుకెళ్లాలని పేర్కొన్నారు. పోలింగ్ రోజున తెల్లవారుజామున మొదట మాక్ పోలింగ్ పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. అన్ని సరి చూసుకున్న తర్వాత సమయానికి ఎలాంటి ఆటంకం కలుగకుండా అసలు పోలింగ్ కార్యక్రమం ప్రారంభించాలని పేర్కొన్నారు. మొదట మాక్ పోలింగ్ నిర్వహిస్తే ఎదురయ్యే ఇబ్బందులు తెలుస్తాయని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు విజయవంతంగా ముగిసేలా పని చేసిన విధంగానే, పార్లమెంట్ ఎన్నికల్లో పని చేయాలని జిల్లా కలెక్టర్ సూచించా రు. ఏమైనా ఇబ్బందులు, సందేహాలు వస్తే పైఅధికారులను సంప్రదించాలని పేర్కొన్నారు. సొంత నిర్ణయాలు తీసుకొని ఇబ్బందులు పడవద్దని తెలిపారు. పోలింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలను జాగ్రత్తగా చూసుకొని క్లోజ్ చేయాలని పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి ఒక్క సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకులా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ విషయంలో ఉద్యోగులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూస్తామని పేర్కొన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యేలా సిబ్బంది సహకరించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, చొప్పదండి, గంగాధర, కొడిమ్యాల తహసీల్దార్లు నరేందర్, రమేశ్, రాజమణి, మాస్టర్ ట్రైనర్లు, పీఓలు, ఏపీవోలు తదితరులు పాల్గొన్నారు.