కరీంనగర్: సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అర్జీలను అందజేశారు. సమస్యలను ఓపిగ్గా విని వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని, పెండింగ్ లో పెట్టవద్దని సూచించారు. విధులు సక్రమంగా నిర్వహిస్తూ పేదలకు బాసటగా నిలవాలని పేర్కొన్నారు. ప్రజావాణికి మొత్తం 225 దరఖాస్తులు వచ్చాయి. కరీంనగర్ మున్సిపల్ కార్యాలయనికి 32, కరీంనగర్ ఆర్డిఓ కార్యాలయానికి 12, డిపిఓ కార్యాలయానికి 11, జిల్లా వైద్యాధికారి కార్యాలయానికి 10, కొత్తపల్లి తహసిల్దార్ కార్యాలయానికి 18, తిమ్మాపూర్ 9, సైదాపూర్ తహసిల్దార్ కార్యాలయానికి సంబంధించి 8 అర్జీలు వచ్చాయి. అర్జీలను తక్షణమే పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పవన్ కుమార్, మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాసు, మెప్మా పీడీ రవీందర్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, ఆయా మండలాల అధికారులు పాల్గొన్నారు.
5 లక్షల చెక్కు అందజేత…
ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు గాను గ్రానైట్ కటింగ్ అసోసియేషన్ జిల్లా ప్రతినిధులు కలెక్టర్ పమేలా సత్పతికి రూ.5 లక్షల చెక్కును అందజేశారు. పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న నేపథ్యంలో తమ వంతు సహాయంగా కలెక్టర్ నిధికి అందజేశామని ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో మైనింగ్ ఏడి రామాచారి, గ్రానైట్ కటింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పి శంకర్, వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ కిరణ్, కోశాధికారి, జిల్లా అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ కలిసిన డిటిసి…
కలెక్టర్ పమేలా సత్పత్తిని తన ఛాంబర్ లో కొత్త డిటిసి పి పురుషోత్తం, డిటిఓ శ్రీకాంత్ చక్రవర్తి మర్యాదపూర్వకంగా కలిశారు. తమ శాఖకు సంబంధించిన పలు అంశాలను కలెక్టర్ కు వివరించారు.