కరీంనగర్: ప్రజావాణి అర్జీలను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ పేదలకు బాసటగా నిలవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. దీనికి జిల్లా స్థాయి అన్ని విభాగాల అధికారులు, మండల అధికారులు హాజరయ్యారు. కలెక్టరు సమస్యలు వింటూ బాధితులు అందజేసిన అర్జీలను స్వీకరించారు. కొన్ని అర్జీలను అప్పటికప్పుడే తక్షణం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి 186 మంది వివిధ సమస్యలపై కలెక్టర్ కు అర్జీలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులపై నిర్లక్ష్యంగా ఉండవద్దని, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అక్రమ నిర్మాణం నిర్మాణాలపై కూడా అధికారులు దృష్టి సారించాలని సూచించారు.
ప్రజావాణిలో మొత్తం 186 ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో కరీంనగర్ మున్సిపల్ కార్యాలయానికి 27, జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయానికి 12, కరీంనగర్ ఆర్డీవో కార్యాలయానికి 16, కరీంనగర్ రూరల్ తహాసీల్దార్ కార్యాలయానికి 12, కొత్తపల్లి తహసిల్దార్ కార్యాలయానికి 10, రామడుగు తహసిల్దార్ కార్యాలయానికి 7, వారధి సొసైటీ కార్యాలయానికి 6 ఫిర్యాదులు వచ్చాయి. రాగా మిగిలిన శాఖలన్నింటికి కలిసి 96 ఫిర్యాదులను కలెక్టర్ స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మి కిరణ్, డిఆర్ఓ పవన్ కుమార్, మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్, ఆర్డిఓ మహేశ్వర్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.