కరీంనగర్: 18 ఏళ్లు పైబడిన వారందరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పోలింగ్ స్టేషన్ల క్రమబద్ధీకరణ ప్రక్రియ పై రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కొత్తగా ఐదు పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుపై ప్రతిపాదనలు వచ్చాయని పేర్కొన్నారు. మూడు పోలింగ్ కేంద్రాల పేర్ల మార్పిడి, 30 పోలింగ్ స్టేషన్ల స్థానాల మార్పుపై ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. ఈ ప్రతిపాదనలను అనుమతి కోసం ఎలక్షన్ కమిషన్ కు పంపిస్తామని పేర్కొన్నారు. పోలింగ్ స్టేషన్ల అంశం విషయంలో ఏమైనా అనుమానాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని రాజకీయ పార్టీల నేతలకు అదనపు కలెక్టర్ సూచించారు. అన్నింటిపై కులంకషంగా చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కొత్త ఓటర్ల నమోదుపై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పవన్ కుమార్, ఆర్డిఓ కే మహేశ్వర్, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్, తహాసిల్దార్లు, బిఆర్ఎస్ పార్టీ ప్రతినిది సత్తినేని.శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మడుపు మోహన్, బిజెపి ప్రతినిధి ఎడమ సత్యనారాయణ రెడ్డి, సిపిఐ (ఎం ) మిల్కురీ వాసుదేవ రెడ్డి, ఎంఐ.ఎం నేత బర్కత్ అలీ, టిడిపి కళ్యాడపు ఆగయ్య, బిఎస్పీ గాలి అనిల్, తదితరులు పాల్గొన్నారు.