నేషనల్ హైవే రోడ్డు పనులపై సమీక్ష

కరీంనగర్: నేషనల్ హైవే రోడ్డు నిర్మాణంలో భాగంగా భూములు, ఇండ్లు కోల్పోతున్న నిర్వాసితులకు అన్యాయం జరుగకుండా చూడాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శనివారం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కరీంనగర్- జగిత్యాల నేషనల్ హైవే రోడ్డు పనులపై ఆ శాఖ అధికారులు, ఆర్డీవో కే మహేశ్వర్ తో వారు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ రోడ్డు పనులకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏ ఏ గ్రామాల నుంచి రోడ్డు పనులు సాగుతాయి.. భూ సేకరణ ఎలా సాగుతున్నది.. పరిహార అంశం ఎక్కడ వరకు వచ్చింది.. వంతెనల నిర్మాణం, తదితర విషయాలను వారు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ కరీంనగర్- జగిత్యాల నేషనల్ హైవే రోడ్డు నిర్మాణంలో భాగంగా 13 గ్రామాల్లో భూమిని సేకరిస్తున్నామని తెలిపారు. ఆయా గ్రామాల్లో భూసేకరణ దాదాపు పూర్తి కావస్తున్నదని చెప్పారు. నిర్వాసితులకు పరిహారం అందించేందుకు అధికారులు భూసర్వే పనులు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. నిర్వాసితులు కోల్పోతున్న వ్యవసాయ భూములు, ఇండ్లు బావులు, చెట్లు, పైపులైన్లు, షెడ్లు అన్నింటి వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలని పేర్కొన్నారు. ఏ ఒక్క వివరాలు మిస్ కాకుండా క్రాస్ చెక్ చేసుకోవాలని సూచించారు. నిర్వాసితులకు అన్యాయం జరగకుండా చూడాలని పేర్కొన్నారు. వారు రోడ్డు నిర్మాణం కోసం భూములను త్యాగం చేస్తున్నారని, మానవతా దృక్పథంతో న్యాయం చేయాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. పరిహారం త్వరగా అందించేందుకు వేగవంతంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. పరిహారం అందించే ప్రక్రియ మే నెలలో పూర్తి చేయాలని సూచించారు. సిబ్బంది కొరత ఉంటే వేరే చోట నుంచి తెప్పించుకొని పనులు స్పీడప్ చేయాలని పేర్కొన్నారు. కరీంనగర్- జగిత్యాల నేషనల్ హైవే రోడ్డు పనులు సాధ్యమైనంత త్వరగా ప్రారంభించేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా పనులు పూర్తయ్యేలా చూడాలని వారు పేర్కొన్నారు. కరీంనగర్- వరంగల్ నేషనల్ హైవే రోడ్డు పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్ష జరిపారు. పనులు వేగవంతంగా చేపట్టాలని సూచించారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హైవే రోడ్డు నిర్మాణంపై పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి పనుల విషయంపై ఎమ్మెల్యే కలెక్టర్ తో చర్చించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హైవే రోడ్స్ అథారిటీ ప్రాజెక్టు డైరెక్టర్ మాధవి, మేనేజర్ నవకాంత్, ఆర్డీవో కే మహేశ్వర్, భూ సేకరణ విభాగం సూపరిండెంట్ శ్రీవాణి, అధికారులు పాల్గొన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

RECENT NEWS