హుజురాబాద్: విద్యార్థులు నిర్దిష్ట లక్ష్యాలను ఏర్పరచుకొని వాటి సాధనకై శ్రమించాలని, సమాజానికి దిక్సూచిలా విద్యార్థులు ఎదగాలని హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ వొడితల ప్రణవ్ అన్నారు. బుధవారం జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోని శ్రీ చైతన్య కరికులం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ కాకతీయ పాఠశాలలో ప్రిన్సిపాల్ మాట్ల సందీప్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. విద్యార్థులు చేసిన సైన్స్ ప్రాజెక్టులు, నమూనాలు ఆకట్టుకున్నాయి. ఈ దినోత్సవానికి ముఖ్యఅతిథిగా వొడితల ప్రణవ్ హాజరయ్యారు. ముందుగా సివీ రామన్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం సైన్స్ ఎక్స్ పో (ఎగ్జిబిషన్) ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సైన్స్ మనిషి జీవితంలో ఒక భాగమని స్పష్టం చేశారు. విజ్ఞాన శాస్త్రానికి సీవీ రామన్ చేసిన సేవలను గుర్తు చేశారు. సైన్స్ ఎగ్జిబిషన్ లాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయవచ్చని అన్నారు. సివి రామన్, శ్రీనివాస రామానుజన్, అబ్దుల్ కలాం లాంటి వారిని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థులు ఎల్లప్పుడూ ఉపాధ్యాయులను తల్లిదండ్రులను గౌరవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ మల్లెంపాటి శ్రీవిద్య, ఏజీఎం రాజు, కోఆర్డినేటర్ ప్రవీణ్, డీన్ మంద శ్రీనివాస్, ప్రైమరీ ఇంచార్జీ తిరుమల, ప్రీ ప్రైమరీ ఇంచార్జీ స్రవంతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.